ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుతో సమావేశమై కోటం రెడ్డి అంశంపై చర్చించారు. నెల్లూరు గ్రామీణ ఇన్చార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై విమర్శలు చేస్తుండగా.. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
దీనిని ముందు నుంచి అధికార వైసీపీ పార్టీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు. కోటంరెడ్డి చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసిపి ఇంచార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు కోటంరెడ్డి ఆరోపణలు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. దీంతో బుధవారం మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
పార్టీ గురించి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని నాలుగు నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించాయిరు. అయితే జగన్‌పై కోపంతో అబద్దం చెప్పాడని అనుకున్నానని తెలిపాడు.
20 రోజుల కిందట తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందని చెప్పాడు. ఏపీ సీఎం జగన్ గానీ.. సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని పేర్కొంటూ అనుమానాలు ఉన్న చోట తాను ఉండాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి చాలా మనస్తాపం చెందానని తెలిపారు.
తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపడితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. బాలినేని వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని బాలినేని చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి మండిపడ్డారు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సజ్జల, విజయసాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నలు కురిపించారు.
“మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా?” అని కోటం రెడ్డి మండిపడ్డారు. ‘ కొద్దిరోజుల క్రితం నా చిన్ననాటి స్నేహితుడితో ఐఫోన్లో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఓ ఆడియో క్లిప్ పంపించాడు. ట్యాపింగ్ చేశారు అనడానికి ఇంతకుమించి ఆధారాలు ఏం కావాలి?’ అని ప్రశ్నించారు.
ఈ ఫోన్ల ట్యాపింగ్ తను ఒక్కడితో ఆగదని ఐఏఎస్‌లు, ఏపీఎస్‌లు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారని ఆరోపించారు. నేను ట్యాపింగ్ అంటున్నా.. కాదంటే మీరే నిరూపించండి.. దీనిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇంత జరిగాక తనకు వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆసక్తి లేదని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉందని.. దీనిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.