తెలంగాణలో అధికారం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతమైన త్రిముఖ వ్యూహంను ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించనుంది.
పైగా, ఉత్తర ప్రదేశ్ లో గత రెండు ఎన్నికలలో ఈ వ్యూహం అమలులో కీలక పాత్ర వహించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో అమలుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా, ఎన్నికల ప్రకటన వారిగానే అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డలతో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా బహిరంగ సభలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఈ నెల 11న అమిత్ షా, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రధాని మోదీ కూడా తెలంగాణకు వస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో షా పర్యటిస్తారు. తొలుత ఫిబ్రవరి 13న ప్రధాని తెలంగాణకు వస్తారని ప్రకటించినా వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగానే నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా ప్రతి కార్యక్రమం 15 రోజుల పాటు కొనసాగేలా కార్యాచరణ సిద్ధం చేసింది. సంస్థాగతంగా పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులను, శక్తికేంద్రాల ఇన్చార్జులను క్రియాశీలం చేయడం, స్థానిక నాయకత్వాన్ని తయారుచేయడం, కేంద్రం ఆయా ప్రాంతాలకు ఎన్ని నిధులు ఇచ్చింది? ఆ నిధులు ఏమయ్యాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ఇచ్చిన హామీలేంటి? వైఫల్యాలేంటి? వంటి అంశాలను చర్చిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనుంది.
ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ సమావేశాల తొలిరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జులతోపాటు జాతీయ పార్టీ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యులు, సీనియర్ నాయకులు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు హాజరవుతారు.
రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు.
మూడు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. జిల్లాస్థాయిలో బహిరంగసభలు పూర్తయిన తర్వాత క్లస్టర్ స్థాయిలో భారీ సభలు ఏర్పాటుచేయనుంది. ఈ సభలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారు.