రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రెండు డిఎన్ఏ ఒక్కటేనని, హిందూ వ్యతిరేకత వాటి విధానమని శుక్రవారం ఆపార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. ఈపార్టీలు ఎన్నికల తర్వాత ఒక్కటవడం ఖాయమని చెబుతూ కుటుంబ, రాచరిక పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందని తెలిపారు.
గత ఐదేళ్లుగా జాతీయ రాజకీయాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ నిర్వహించిన అన్ని సమావేశాలకు మద్దతు ఇచ్చి పాల్గొన్నదని ఆయన గుర్తు చేశారు. ప్రజలు అరాచక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు నిజాయితీతో కూడిన జనతా సర్కారును కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు స్పష్టం చేశాయని మన గెలుపును అడ్డుకునేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బిజెపికి పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను మనం తిప్పికొట్టాలని చెబుతూ ఈ రెండు పార్టీలకు సహజ మిత్రుడైన ఎంఐఎం వాటికి వంత పాడుతోందని ధ్వజమెత్తారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన సిఎం కెసిఆర్ అధికారం చేపట్టిన తరువాత విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు జూన్ 2ను బిజెపి ఒత్తిడి మేరకు గత ఏడాది అధికారికంగా, మొక్కుబడిగా నిర్వహించినట్లు నటించారని అంటూ ఈ విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడాది నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుండడంతో వేరే దారి లేక, గత్యంతరం లేక రాష్ట్రంలో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కుటుంబ పార్టీ, అవినీతి పార్టీలను తెలంగాణలో బిజెపిని విజయ పథాన నడిపించడానికి పూర్తి శక్తియుక్తులతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.