బంగ్లా యుద్ధం – 19
1971 యుద్ధంలో వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా పాకిస్థాన్ గందరగోళ పరిస్థితులలో ఉండడం కూడా భారత్ సేనలు అనూహ్య విజయం సాధించడానికి దారితీసిన్నట్లు చెప్పవచ్చు. తూర్పు పాకిస్థాన్ లో తాము సాగిస్తున్న మరణకాండపై భారత్ వ్యూహం ఏమిటో, సైనిక లక్ష్యాలు ఏమిటో పాక్ సేనలు గందరగోళంలో పడడమే అందుకు ప్రధాన కారణం.
వాస్తవానికి అక్టోబర్ మధ్య నాటికి పాకిస్తాన్ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంది. నవంబర్ మధ్య నాటికి గాని భారత సైన్యం కార్యాచరణకు సిద్ధపడలేదు. అప్పటి వరకు సేనలు, సాధన సంపత్తి సమీకరణలో మునిగిపోయింది. సైనిక చర్య ద్వారా భారత్ జోక్యం చేసుకోకుండా కట్టడి చేయాలి అనుకొంటే, భారత సేనలు యుద్దానికి సిద్దపడేంత వరకు ఎందుకు ఎదురు చూసారు? అంతుబట్టని ప్రశ్న.
అక్టోబర్ లోనే పాకిస్థాన్ ఆకస్మిక దాడికి దిగి ఉంటే, భారత సైన్యానికి పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. పాకిస్తాన్ తన దాడిని ప్రారంభించే వరకు భారత్ దాడి చేయకూడదని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిసెంబర్ 3న భారత్ పై వైమానిక దాడికి దిగడం ద్వారా పాకిస్థాన్ అధికారికంగా యుద్ధం ప్రారంభించినట్లు అయింది. అందుచేత అంతర్జాతీయంగా నైతిక మద్దతు కోల్పోయింది.
భారత్ వ్యూహానికి ప్రతీగా, తూర్పులో యుద్ధం చేయకుండా భారతదేశాన్ని నిరోధించడానికి పాకిస్తాన్ పశ్చిమ దేశాలను సమీకరించింది. అమెరికా, చైనాలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల వచ్చే ముప్పును పాకిస్థాన్ అతిగా ప్రదర్శించింది. ఆ రెండు దేశాలు భారత్ తమపై సైనిక దాడి జరుపకుండా అడ్డుకొంటాయని ఎన్నో ఆశలు పెట్టుకొంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా ఆ రెండు దేశాలు కలసి భారత్ ను `కాల్పుల విరమణ’కు ఒప్పుకొనేటట్లు చేస్తాయని భావించింది.
అయితే సైనికపరంగా జోక్యం చేసుకోకూడదనే వ్యూహాత్మక విధానం అనుసరించిన చైనా తన ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు పాకిస్థాన్ కు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. మరోవంక, అమెరికా కూడా పాకిస్తాన్కు ఎటువంటి స్పష్టమైన భరోసా ఇవ్వలేదు. బలప్రదర్శన ద్వారా విజయం సాధించాలంటే, ఒకరి సైనిక సామర్ధ్యం ప్రత్యర్థిని దారిలోకి తెచ్చుకొనే విధంగా ఉండాలి.
భారత సాయుధ దళాలు పాకిస్తాన్ కు ధీటుగా, ఒకింత మెరుగుగా ఉన్నప్పటికీ రాజకీయ పరిష్కారంపై పాకిస్థాన్ ను ఒప్పుకొనే విధంగా చేయగల స్థాయిలో లేవు. అందుకనే భారత్ కు సైనిక జోక్యం అనివార్యమైనది. తూర్పు సరిహద్దుల్లో భారత్ సేనలను మోహరిస్తుండడంతో సైనిక చర్యకు సిద్ధపడుతున్నట్లు పాకిస్థాన్ ముందుగానే గ్రహించింది.
అయితే భారత దేశం లక్ష్యం ఏమిటో అర్థం కాక కొంత గందరగోళానికి గురయింది. ఢాకా దాకా భారత్ సేనలు వస్తాయని అసలు ఊహించనే లేదు. కేవలం తమను భయపెట్టడం కోసం ఆ విధంగా చేస్తుందా? బాంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటుకు సరిహద్దు వెంబడి కొన్ని భూభాగాలను ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తుందా? అక్కడ ఏర్పడే కీలుబొమ్మ ప్రభుత్వంకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తుందా?
లేదా పూర్తిస్థాయి యుద్ధంకు దిగి పాక్ సైన్యం లొంగిపోయే విధంగా చేస్తుందా? అందుకోసం పూర్తిస్థాయి యుద్ధంకు దిగుతుందా? పాక్ తేల్చుకోలేక పోయింది. సరిహద్దు, అంతర్భాగంలో సమకాలీకరించబడిన తీవ్ర కార్యకలాపాలు తూర్పు పాకిస్తాన్లో భారత దేశపు రాజకీయ-సైనిక లక్ష్యాల గురించి పాకిస్తాన్ను భయపెట్టాయి. తీవ్ర సందిగ్ధతకు దారితీశాయి.
తమ సైన్యంను ఓడించి, లొంగుబాటు జరిగే విధంగా చేసి, బాంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించడం కోసం భారత్ ప్రణాళికాబద్ధమైన సైనిక దాడిని ప్రారంభిస్తుందా? పాక్ ఏమీ తేల్చుకోలేక పోయింది. సరిహద్దు వెంబడి కొన్ని ప్రాంతాలను మాత్రమే భారత్ ఆక్రమించుకోగలదనే అభిప్రాయంతో తన సేనలను ఢాకా, ఇతర ప్రధాన నగరాలకు రక్షణగా మోహరింప చేయడం పాక్ ప్రారంభించింది.
దానినే అదనుగా తీసుకొని పాక్ సైన్యం ఖాళీచేసి లోతట్టు ప్రాంతాలపై ముక్తి బహిని ఆధిపత్యం ఏర్పరచుకోవడం ప్రారంభించింది. నవంబర్ 21 నుండి తూర్పు పాకిస్తాన్లోని భూభాగాన్ని భారతదేశం ఆక్రమించుకోవడం ప్రారంభించింది. దానితో తమ నాయకత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం తప్ప ఏమీ చేయడం లేదని భావించిన పాకిస్తాన్ అధికారులు మండిపోవడం ప్రారంభించారు.
తమ గౌరవం కాపాడుకోవడానికి భారత్ పై యుద్ధం ప్రకటించాలని వారు గట్టిగా భావించారు. అదే సమయంలో భారత్ దురాక్రమణకు ధీటుగా స్పందించని పక్షంలో “ప్రజలే చంపివేస్తారు” అంటూ దేశాధ్యక్షుడిని భుట్టో హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసిన్నట్లయింది.
డిసెంబర్ 3న యాహ్యా ముందస్తు వైమానిక దాడులకు ఆదేశించడాన్ని భారత్ సహజంగానే స్వాగతించింది. అదను కోసం ఎదురుచూస్తున్న భారత్ ప్రపంచం దృష్టిలో దురాక్రమణదారునిగా ముద్ర పడకుండా “ఆత్మరక్షణ” కోసం యుద్దానికి దిగక తప్పలేదనే సంకేతం ఇవ్వగలిగింది. ఈ సమాచారం తెలియగానే, నాటి ప్రధాని ఇందిరా గాంధీ కోర్ గ్రూప్ సభ్యుడు డి పి ధర్ “మూర్ఖుడు ఊహించినట్లుగానే చేసాడు” అని క్లుప్తంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
రెండు పాకిస్తాన్ల మధ్య విస్తారమైన భౌగోళిక విభజనను పరిశీలిస్తే, పశ్చిమంలో యుద్ధంకు దిగడం ద్వారా తూర్పుపై భారత్ సైనిక దాడి జరపకుండా కాపాడుకో గలమని పాకిస్థాన్ వేసిన ఎత్తుగడ అసంబద్దమైనదని స్పష్టం అవుతుంది. అయినప్పటికీ, అది తన ప్రమాదకర ప్రణాళికలను దూకుడుగా అమలు చేయలేక పోవడంతో పాక్ కు పరాజయం తప్పలేదు.