రాజస్థాన్ రాజధాని జైపూర్లోని గణపతి ప్లాజాలో ఉన్న 1,100 ప్రైవేట్ లాకర్ల గుట్టు రట్టవుతుంది. గడిచిన మూడు వారాల్లో ఐదు లాకర్లను తెరిచిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటివరకూ రూ.7 కోట్ల నగదు, 12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. మరికొన్ని లాకర్లను తెరవాల్సి ఉన్నది.
గణపతి ప్లాజాలోని ఓ ఫ్లాట్లో ప్రైవేట్ లాకర్లు ఉన్నాయని, వాటిలో రూ.500 కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారం ఉన్నదని బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా గత నెలలో సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు లాకర్లు తెరిచే వరకు తాను గేటు వద్దే కూర్చొని ధర్నా చేస్తానని ప్రకటించారు. లాకర్లలో ఉన్నదంతా అధికార కాంగ్రెస్కు చెందిన డజనుకు పైగా ఎమ్మెల్యేలు, ఆరేడు మంది మంత్రులకు చెందిన అవినీతి సొమ్మేనని ఆరోపించారు.
పేపర్ లీక్, జల్జీవన్ మిషన్లో అక్రమంగా దోచుకొన్న సొమ్మే ఇక్కడ దాచుకొన్నట్టు మండిపడ్డారు. పదేైండ్లెనా లాకర్లను ఇప్పటివరకూ తెరువలేదని ధ్వజమెత్తిన కిరోడి చట్టబద్ధసొమ్ము అయితే, ప్రైవేటు లాకర్లలో ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పంచేందుకే ఈ సొమ్మును కాంగ్రెస్ ఇక్కడ నిల్వ చేసినట్టు ఆరోపించారు.
ఈ ఘటన వివాదాస్పదమైంది. ప్రజాక్షేత్రంలో పెద్దయెత్తున చర్చకు దారితీసింది. లాకర్లు తెరువాల్సిందిగా అధికారులపై సర్వత్రా ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు కదిలిన పోలీసులు గడిచిన మూడువారాల్లో ఐదు లాకర్లను తెరిచి రూ. 7 కోట్ల నగదును, 12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. మరిన్ని లాకర్లను తెరిచే ప్రయత్నం చేస్తామన్నారు.