ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పూరించారు. ఏకకాలంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలను ఆమె ప్రారంభించారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని భీమవరంలో వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పురందరేశ్వరి మాట్లాడుతూ శంఖం పూరించడం ద్వారా ఎన్నికల నగారా మోగించామని తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు ప్రజా పోరుయాత్ర నిర్వహిస్తామని చెబుతూ ప్రతి కార్యకర్త చేతిలో బీజేపీ జెండా గుండెలో ఏపీ అభివృద్ధి అజెండా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు.
ఏపీలో బీజేపీ బలోపేతానికి పార్టీశ్రేణులు కృషి చేయాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. ప్రజల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలా? మోడీ ప్రభుత్వం కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. మీ చెల్లిని కూడా చూడలేని ముఖ్యమంత్రికి మహిళా సాధికారత కోసం మాట్లాడే హక్కు లేదని ఆమె ఎద్దేవా చేశారు. నరసాపురం పార్లమెంట్ లో బీజేపీ మూడుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు ఎంపీగా గెలుచుకున్న చరిత్ర ఉందని ఆమె గుర్తు చేశారు.
రాజధానులు లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, వైసిపి పార్టీలు కేంద్రం సహకరించలేదని చెబుతున్నాయని, అయితే డిపిఆర్ కు ముందే 2500 కోట్లు రాజధానికి కేంద్రం ఇచ్చిందని ఆమె తెలిపారు. నరసాపురం వశిష్ట వారధికి కేంద్రం 400 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
జాతీయ హోదా ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందని చెబుతూ పోలవరం నిర్మాణంలో టిడిపి హయాంలో మూడేళ్లు జాప్యం జరిగిందని, వైసీపీలో రివర్స్ ట్రెండింగ్ వల్ల పోలవరం దెబ్బతిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అంటున్నారని, అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేశాక ప్యాకేజీకి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకే చెప్పిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు.
టిడిపి, వైసిపి, కాంగ్రెస్ మూడు పార్టీలు బిజెపిపై నిందలు వేస్తున్నాయని ఆమె ఆరోపించారు. స్టిక్కర్ల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మిగిలిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. బిల్లులు రాక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీని దూరం పెడుతున్నాయని ఆమె ఆరోపించారు. పొత్తుల విషయంపై మాట్లాడుతూ ప్రస్తుతం జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, పొత్తుల విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
వైసిపి ప్రభుత్వం విధ్వంసక పాలన విద్వేషపూరిత పాలన కొనసాగిస్తొందని ఆమె ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమై ఆలయాలు సైతం ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. ఏపీలో ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని, సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆమె ఆరోపించారు. ప్రజా కంఠక పాలనపై గళ మెత్తాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త తీసుకోవాలని ఆమె కోరారు.
