కొద్ది రోజులుగా జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెర పడినట్టే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం ఆయనతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఉపాధ్యక్షుడిగా పని చేస్తోన్నారాయన. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో రవాణా మంత్రిగా వ్యవహరించారు. హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపై సోరెన్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు జేఎంఎం సభ్యులు.
తనకు మద్దతు ఇస్తోన్న శాసన సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం రాజ్‌భవన్ వద్ద పరేడ్ సైతం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని గవర్నర్ సమక్షంలో నిరూపించుకున్నారు. దీనితో ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించారు.
చంపై సోరెన్‌తో పాటు మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన సత్యానంద్ భోక్తా, కాంగ్రెస్ సభ్యుడు ఆలంగిర్ ఆలం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యుల బలం అవసరమౌతుంది.
జేఎంఎం-30, కాంగ్రెస్-16, రాష్ట్రీయ జనతాళ్కు చెందిన ఒక సభ్యుడు అధికార కూటమికి మద్దతు ఇస్తోన్నారు. 47 మంది సభ్యుల బలంతో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 25 సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్షంలో కొనసాగుతోంది.
మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అధినేత హేమంత్ సోరెన్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, అరెస్ట్ అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారాయన.