మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికెట్ పై నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
నవనీత్ 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. అయితే, ఆమె నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు ఆరోపించారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని గుర్తించింది. ఈ మేరకు ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది.
అయితే, బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నవనీత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్ ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈసారి ఆమెకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో నవనీత్ కౌర్ భారతీయ జనతా పార్టీలో చేరారు.