ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. నిబంధనను రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి హామీ కూడా ఇచ్చింది.
మరోవైపు.. గత ప్రభుత్వంలో ఎక్సైజ్‌లో జరిగిన అవతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చించారు. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తొలగించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తీసుకురావాలని కేబినెట్ సూచన చేసింది.
ఇక మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దు కేబినెట్ రద్దు చేసింది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రీ-సర్వే ప్రక్రియను నిలుపుదలలో పెట్టాలని కెబినెట్ నిర్ణయించింది.