దేశంలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేయాలి అనుకొంటున్న బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించడం పట్ల మాజీ ఉపప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విముఖత వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రస్తుతం తమ పార్టీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కూటమికి చైర్మన్గా ఉండాలన్న ఆసక్తి కూడా తనకు లేదని స్పష్టం చేశారు.
అయితే కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిర్మించే ఏ వేదికలోనైనా కాంగ్రెస్ను దూరంగాని ఉంచలేమని ఆయన తేల్చి చెప్పారు. ‘‘బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. కూటమి కట్టాలంటే విపక్షాలు కొన్నింటిని మర్చిపోవాలి” అని ఆయన హితవు చెప్పారు.
మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పశ్చిమబెంగాల్లో బలమైన పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామంలోనూ ఆ పార్టీకి కార్యకర్తలున్నారన్నది వాస్తవం అని ఆయన గుర్తు చేశారు.
“అందుకే బీజేపీ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కాంగ్రెస్ను కలుపుకుని పోవడం తప్పనిసరి. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నెలకొనాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఒక్క పార్టీయే ఉంటే రష్యాలో పుతిన్ నాయకత్వంలా ఉంటుంది’’ అని శరద్ పవార్ హెచ్చరించారు.
హిందువులే గాక ఇతర మతస్తులు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యేలా కశ్మీరీ ఫైల్స్ సినిమాను చిత్రీకరించారని ఆయన విమర్శించారు. పాక్ అనుకూల వర్గం అప్పట్లో కశ్మీర్ లోయలో హిందువులతోపాటు ముస్లింలపైనా అరాచకాలకు పాల్పడిందని గుర్తు చేశారు.
అయితే, కాపాడాల్సిన నాటి ప్రభుత్వం హిందువులను రాష్ట్రం వదిలి పొమ్మందని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడిపైనే గాక నిత్యావసరాల ధరలు, రవాణా ఖర్చులపైనా పడుతోందని పవార్ విమర్శించారు.