భారత స్వాతంత్ర పోరాటంలో తను, మన, ధన, ప్రాణాలను త్యాగం చేసిన వారిలో చాలా మంది కనీస గుర్తింపునకు కూడా నోచుకోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చరిత్ర పుస్తకాల్లో సరైన స్థానం కల్పించడం ద్వారా వారి త్యాగాలను యువతరానికి, చిన్నారులకు తెలియజేయాల్సిన అవసరముందని సూచించారు.
ఇలాంటి గాథల స్ఫూర్తితో వారు జాతి నిర్మాణంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు. బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతివేత్త హేమవతి నందన్ బహుగుణ జీవిత చరిత్ర ‘హేమవతి నందన్ బహుగుణ: ఎ పొలిటికల్ క్రుసేడర్’ పుస్తకాన్ని (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) ఆవిష్కరించారు.
ఈ పుస్తకాన్ని హేమవతి నందన్ బహుగుణ కుమార్తె, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి, డాక్టర్ రామ్ నరేశ్ త్రిపాఠీలు రాశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర ఎంతో ఘనమైనదని, ఎందరో వీరులు స్వాతంత్య్ర సాధన అనే ఏకైక లక్ష్యంతో సర్వస్వాన్నీ త్యాగం చేశారని కొనియాడారు. అలాంటి చరిత్ర మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
హేమవతి నందన్ బహుగుణ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశ సేవకోసం సర్వస్వాన్నీ అర్పించారన్న ఉపరాష్ట్రపతి, స్వాతంత్య్రనంతరం కూడా విలువలతో కూడిన రాజకీయ జీవితం, చతురత కలిగిన పాలకుడిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారని గుర్తు చేశారు.
వారి జీవిత చరిత్రను చదువుతుంటే మొదట రెబల్‌గా, ఆ తర్వాత వారి ఆలోచనలన్నీ దేశం ప్రాధాన్యతగానే ఉండేవనే విషయం సుస్పష్టం అవుతుందని చెప్పారు. బహుగుణ 17 ఏళ్లకే స్వాతంత్య్ర సంగ్రామంలో భాగస్వాములయ్యారని, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయినపుడు జైల్లో బ్రిటిషర్ల చిత్రహింసలను అనుభవించారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
మాతృభూమి కోసం లాభాపేక్ష లేకుండా పనిచేశారని, . స్వాతంత్య్రనంతరం భారత ప్రభుత్వం వారి పోరాటాన్ని గుర్తించి కాస్త భూమిని కూడా ఇచ్చేందుకు ముందుకు రాగా, దాన్ని కూడా బహుగుణ సున్నితంగా తిరస్కరించడం, ఆ భూమిని ఇతరులు ఎవరికైనా ఇవ్వాలని కోరడం ఆయన నిరాడంబరతకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.
గాంధేయవాదిగా విలువలతో కూడిన రాజకీయాలను అలవర్చుకున్న బహుగుణ, దేశంలో అత్యయిక పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థి దశ నుంచే ఆయన పేదల కోసం, విద్యార్థులకు చదువు చెప్పించాల్సిన అవసరం గురించి పోరాడారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఎస్సీ, ఎస్టీలకు భూవితరణ చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు.
ఇందుకు మెచ్చిన వినోబా భావే, బహుగుణకు ‘మిట్టీ నందన్’ అని బిరుదునివ్వడం సాధారణ విషయం కాదన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రమైన తాగునీరు, మహిళలు దూరం నుంచి నీటిని తెచ్చుకోవడం తదితర అంశాలపై బహుగుణ ఎంతో కృషిచేశారని వివరించారు.
1980లో ఓ రాజకీయ పార్టీనుంచి రాజీనామా చేసిన బహుగుణ ఆ వెంటనే తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం వారి విలువలతో కూడిన రాజకీయ జీవితానికి ఒక ఉదాహరణ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లో లేని రోజుల్లోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గొప్పవిషయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, విజయ్ బహుగుణ, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రీటా బహుగుణ జోషితోపాటు పలువురు రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.