తెలంగాణలో రైతుల జీవితాలు చీద్రం అవుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం తెలంగాణ రైతు వెలిగి పోతున్నాడంటూ బూటకపు ప్రచారం చేసుకుంటున్నాడని రైతు సంఘాల ఐక్య వేదిక నిర్వహించిన రౌండ్ కు రాష్ట్రం నలుమూలల నుండి హాజరైన రైతు ప్రతినిధులు ధ్వజమెత్తారు.
వేదిక సమన్వయకర్త ఎస్ జైపాల్ రెడ్డి అధ్యక్షతన హాజరైన సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి రైతు ప్రతి నిధులు హాజరై కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు, జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 26 రాష్ట్రాల నుండి వచ్చిన రైతు ప్రతి నిధులు క్షేత్ర స్థాయి లో పర్యటన చేసారా? రైతుల గోడు విన్నారా? అని ప్రశ్నించారు.
ఫైవ్ స్టార్ హోటల్ నుండి కెసిఆర్ కు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? అని నిలదీశారు, నల్గొండ జిల్లా కు చెందిన రైతు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై రైతు సంఘాలకు ఏనాడైనా కెసిఆర్ అనుమతి ఇచ్చాడా? అని ప్రశ్నించారు, లక్ష రూపాయల రుణ మాఫీ హామీ ఏమయింది అడిగారు.
బ్యాంకు లు రైతులను డిఫల్టార్ గా ప్రకటించాయని, కొత్త అప్పులు పుట్టక అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకొని భారం మోయలేక ఆత్మ హత్యలు చేసుకుంటుంటే కెసిఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడని ఆరోపించారు,
భారతీయ కిసాన్ సంఘ్ నేత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇన్పుట్స్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులను తీవ్రంగా నష్ట పరుస్తూ కెసిఆర్ ప్రభుత్వం జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. పంటల బీమా పథకం ఈ రాష్ట్రము లో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు.
చందనవెళ్లి భూ నిర్వసితులు మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న కెసిఆర్ మా దళితుల భూములు సెజ్ ల పేరుతో గుంజుకొని న్యాయ మైన పరిహారం ఇవ్వకుండా వేదిస్తున్నదని. ఆరోపించారు. భూ నిర్వసితులను బిచ్చగాళ్లు గా కెసిఆర్ ప్రభుత్వం చూస్తున్నదని యాచారం ఫార్మ సిటీ భూ నిర్వశిత బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. మిడ్ మానేరు బాధితులు పరిహారం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకొనే నాథుడే లెడని వాపోయారు.
ఐక్య పోరాటాల ద్వారా కెసిఆర్ మెడలు వంచే ఉద్యమానికి కార్యాచరణ చేయడానికి ఈ వేదిక ఆలోచన చేయాలనీ బాధిత రైతులు కోరారు. అందరు రైతు సంఘాల ఆలోచనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై ఆందోళన కార్యక్రమాలు యోజన చేస్తామని జైపాల్ రెడ్డి ప్రకటించారు.