కొద్దికాలం క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీనటి దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేఎల్పీ నేత, తెలంగాణ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో ఆమె భేటీ కావడంతో ఇటువంటి కధనాలు వెలువడ్డాయి.
గురువారం ఉదయం హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనతో ఆమె భేటీ అయ్యారు. త్వరలోనే బిజెపిలో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం. దివ్యవాణి ముఖ్యంగా తెలంగాణలో క్రియాశీలకంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది.
2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆమె టీడీపీలో చేరారు. అధికార ప్రతినిధిగా ఆమెను నియమించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే మే నెలలో జరిగిన మహానాడులో తనకు ప్రసంగించే అవకాశం ఈయలేదని, పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ దివ్యవాణి టీడీపీకి దూరమయ్యారు.