బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీష్‌కుమార్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. గతంలో నితీష్‌కుమార్ ప్రధాని మోదీతో ఉన్న నాలుగు ఫోటోలపై ‘డిలీటెడ్’ అనే స్టాంప్‌తో ట్విటర్లో పోస్ట్ చేశారు.
నితీష్ కుమార్ నెల క్రితం కేంద్రంలోని అధికార పార్టీతో ఉన్నారని, కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలతో జత కట్టారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇది ఎంతవరకు నమ్మదగినదో అనేది ప్రజలే నిర్ణయిస్తారని అంటూ తెలిపారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వం దేశంపై పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని, ఇది రాష్ట్ర ప్రత్యేక అభివృద్ధిగా కనిపిస్తోందని పెదవి విరిచారు.
బీహార్ కూటమి జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపుతుందని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఎవరైనా ప్రయత్నించడానికి స్వేచ్ఛ ఉందని తెలిపారు. నితీష్ ఇతరులపై ఆధారపడకుండా ఆయన ఉండలేరని చెప్పారు.
మరోవంక, ఢిల్లీలో పలువురు ప్రతిపక్ష నేతలతో భేటీ అవుతున్న నితీష్‌కుమార్ సహితం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ తనతో సమావేశమైనపుడు ఎన్నికల వ్యూహాల బిజినెస్‌ను ఆపేసి తనతో రావాలని కోరానని పేర్కొన్నారు. కానీ అతను తన మాట వినలేదని దేశవ్యాప్తంగా చాలా పార్టీల కోసం పనిచేస్తున్నాడని… అది అతని దందా (వ్యాపారం) అని అంటూ కొట్టిపారేశారు.
ప్రశాంత్ కుమార్ ప్రచార వ్యవహారాలలో నిపుణుడిని, అందుకోసం ఏదైనా చేస్తుంటారని అంటూ నితీష్ తెల్చిపారవేసారు. ఆయనే చేసే ప్రకటనలకు అర్థం లేదని అంటూ బిజెపి కోసం ప్రశాంత్ రహస్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
బీహార్‌లో ప్రశాంత్ కిషోర్ చర్యలను స్వాగతించామని, కానీ ఆయన వ్యాఖ్యలు, చర్యల మధ్య పొంతన లేదని తెలిపారు. బీహార్ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యల గురించి తనకి తెలుసా అని నితీష్ ప్రశ్నించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తున్నారని అంటూ ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ప్రశాంత్ బిజెపితో ఉండాలని కోరుకుంటున్నారా? లేదా బిజెపికి సహాయం చేస్తున్నారా? అన్నది తప్పకుండా బయటకు వస్తుందని దుయ్యబట్టారు. ప్రశాంత్ కిషోర్ గతంలో అధికార బిజెపితో పాటు కాంగ్రెస్, టిఎంసి, జెడియుల విజయం కోసం ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.