జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గత నెల విజయవాడలో అకస్మాత్తుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కలిసి, ఇరువురం ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం జరుపుతామని ప్రకటించడంతో రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో పొత్తుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు పంపినట్లయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నంకు రెండు రోజుల పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడం, విశాఖపట్నంలో అందుబాటులో ఉండమని కోరుతూ ఆయన కార్యాలయం ఫోన్ చేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా సంభవిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
2014లో బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకున్న తర్వాత పవన్ ప్రధానిని కలవడం ఇదే కానున్నది. ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ నగరంలోనే ఉంటారు.శుక్రవారం రాత్రి గాని, శనివారం ఉదయం గాని వారు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
ఈ భేటీ సందర్భంగా బిజెపి, జనసేనల మధ్య నెలకొన్న అపోహాలు తొలగే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. పైగా, వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసేందుకు బలమైన భూమిక ఏర్పడే అవకాశం కూడా ఉంది. తమ పార్టీతో పొత్తు ఏర్పర్చుకున్న పవన్ను సరిగా ఉపయోగించుకోవడం లేదంటూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ మధ్య వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదే సమయంలో ప్రధానిని వ్యక్తిగతంగా కలవడం కోసం కొందరు వైసిపి ప్రముఖులు ప్రయత్నించినా అనుమతి లభించలేదని తెలిసింది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అడిహకారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసెనా ప్రధాని కార్యాలయం సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను స్వయంగా ప్రధాని ఆహ్వానించడం గమనిస్తే జనసేనతో తమ పార్టీకి గల సంబంధాల గురించి ప్రధాని స్పష్టమైన సంకేతం ఇవ్వదలచిన్నట్లు వెల్లడి అవుతుంది.