తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా 32 నియోజవర్గాల్లో కార్యనిర్వహకులను నియమించింది. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యనిర్వాహకులను నియమించామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు.
కొత్తగా కార్యనిర్వాహకులుగా బాధ్యతలు చేపట్టిన వారంతా ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులపై పార్టీకి నివేదికలను అందజేస్తారని తెలిపారు. నివేదికల ఆధారంగానే నియోజకవర్గాల్లో జనసేన తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ప్రకటించినట్టు వేమూరి శంకర్ గౌడ్ వివరించారు. ఏపీలో జనవాణి కార్యక్రమంతో తన గ్రాఫ్ పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా, గత ఎన్నికలలో రెండు చోట్ల నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ ఈ పర్యాయం అసెంబ్లీతో పాటు లోక్ సభకు కూడా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. అసెంబ్లీకి గెలుపొందిన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండే వీలులేదని, మరొకరి మంత్రివర్గంలో చేరడం సరికాదని, ఎంపీగా గెలుపొందితే కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ పొందవచ్చని ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీకి కాకినాడ జిల్లా పిఠాపురం పోటీ చేయడంతో పాటు, అనంతపూర్ నుండి లోక్ సభకు పోటీ చేయవచ్చని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ విధంగా చేయడం వల్లన ఒక వంక రాయలసీమలో, మరోవంక పార్టీకి మంచి పట్టున్న గోదావరి జిల్లాల్లో కూడా ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.