వైఎస్సార్ బిడ్డను కేసీఆర్ పంజరంలో పెట్టి బంధించవచ్చని అనుకుంటున్నారని, అది కేసీఆర్ తరం కాదని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల హెచ్చరించారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని అంటూ మళ్లీ చెప్తున్నా వైఎస్సాఆర్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని స్పష్టం చేశారు.
తిరిగి వైఎస్సార్ పాలన తిరిగొచ్చే వరకు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ఆమె తేల్చి చెప్పారు. హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా కేసీఆర్ పోలీస్ భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకొంటారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని ఆమె ఇంటి వద్దనే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఎమర్జెన్సీ వార్డు నుంచే సీఎం కేసీఆర్ కు ఆమె హెచ్చరిక సందేశం పంపారు.ఆమరణ దీక్ష చేస్తుంటే నన్ను మా కార్యకర్తలను బందీలను చేశారని, తమ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు.
లోటస్ పాండ్ చుట్టూ అన్ని వైపులా బారికేడ్స్ ఏర్పాటు చేసి కర్ఫ్యూ విధించారని, తమ కార్యకర్తలను మెడ పట్టుకొని పోలీస్ వ్యాన్లలో ఎక్కించారని, పోలీస్ స్టేషన్లలో పెట్టి దారుణంగా కొట్టారని షర్మిల ధ్వజమెత్తారు. కానీ వీటన్నింటిని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారని ఆమె కొనియాడారు.
“వైఎస్సార్ బిడ్డ ఒకటే చెప్తుంది. మీ త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదు. పేరు పేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టిన భరించారు. వైఎస్సార్ పై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు” అంటూ ఆమె అభినందించారు.