ఓమహిళా అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ తన మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ కు అప్పగించారు
కురుక్షేత్రలోని పెహోవా బీజేపీ ఎమ్మెల్యే అయిన సింగ్ తనను తొలుత జిమ్‌లో చూశారని, ఆపై ఇన్‌స్టాగ్రాంలో పరిచయం పెంచుకున్నాడని మహిళా అథ్లెటిక్ కోచ్ ఆరోపించారు. ఇన్‌స్టాలో తనతో పరిచయం పెంచుకున్న మంత్రి ఆపై తనను కలుసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు.
తన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉందని, ఈ విషయమై తనను కలవాలని కోరాడని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఫెడరేషన్లో తన సర్టిఫికెట్ గల్లంతు కాగా చివరకు తాను మంత్రి వద్దకు డాక్యుమెంట్లతో వెళ్లానని, ఈ క్రమంలో సందీప్ సింగ్ తన పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
సందీప్ సింగ్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన ఒలింపియన్ కూడా. ఆయన తనను లైంగికంగా వేధించారని జూనియర్ మహిళా కోచ్ శుక్రవారం చండీగఢ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో, నగర పోలీస్ సూపరింటెండెంట్ శ్రుతి అరోరాకు ఫిర్యాదు చేశారు. అనంతరం అరోరాతో కలిసి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా చౌదరితో కూడా మాట్లాడారు.
ఇదిలావుండగా, తన మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్‌కు అప్పగించానని సందీప్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. నైతిక కారణాలతో బాధ్యత తీసుకుని తాను తన శాఖను ముఖ్యమంత్రికి అప్పగించినట్లు తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
“నా ప్రతిష్ఠను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది. నాపై మోపిన తప్పుడు ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నాను. దర్యాప్తు నివేదిక వచ్చే వరకు నా మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రికి అప్పగించాను’’ అని సందీప్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.
ఫిర్యాదుదారు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ప్రతిపక్ష పార్టీ) కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సందీప్ సింగ్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన తనను గత ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబరు వరకు వేధించినట్లు ఆరోపించారు. తన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.