టిడిపికి చెందిన మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలలో హైదరాబాద్ లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్‌లోని మెలాంజ్ టవర్స్‌లో గల నారాయణ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులతోనే నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసింది.
చంద్రబాబును ఎ -1గా, నారాయణను ఏ -2గా సీఐడీ చేర్చగా ఫిర్యాదు ఆధారంగా 120బి, 34, 420, 36,37,166 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో 2014–19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా పేర్కొన్నారు.
అంతేకాదు ఆన్ లైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హోసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ ఇ పి ఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ది కలిగించారని ఆరోపించారు. దీనిపై అప్పట్లో నారాయణకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల ఆయన ఇంట్లోనే అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఇక ఇప్పుడు ఏపీ సీఐడీ సోదాలతో మరోసారి కలకలం రేగింది.