నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆరు నెలల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి పార్టీకి దూరమయ్యారు. అంతటితో ఆగకుండా జగన్ ను నేరుగా టార్గెట్ చేసి నాలుగేళ్లపాటు నరసాపురం నియోజకవర్గంతో పాటు ఏపీకి దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఓ దశలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలని భావించిన రఘురామకు చివరి నిమిషంలో ఆయన వైసీపీపై చేసిన పోరాటమే కలిసొచ్చింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు.
పాలకొల్లులో చంద్రబాబు నాయుడు జరుపుతున్న ప్రజాగళం యాత్రలో రఘురామరాజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చంద్రబాబు బహిరంగ సభలోనే నేరుగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా రఘురామ నాలుగేళ్లుగా చేసిన పోరాటం, ఆయన్ను జగన్ టార్గెట్ చేసిన తీరును చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని రఘురామ తెలిపారు. జూన్ 4న గెలిచేది ఎన్డీయే కూటమేనని రఘురామ జోస్యం చెప్పారు.
బీజేపీలో నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినా రఘురామకు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరిన ఆయనకు నరసాపురం సీటు ఇచ్చి కావాలంటే ఏలూరు ఎంపీ స్ధానం తీసుకోమని బీజేపని చంద్రబాబు కోరుతున్నారు. ఇందుకు బీజేపీ అంగీకరిస్తే సరి లేకపోతే ఆయన కోసం తమ సిట్టింగ్ ఎమ్మెల్యే స్ధానం ఉండిని కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాను కేంద్రానికి వెళ్లాలని కోరరుకుంటున్నానని, కానీ ప్రజలు మాత్రం తనను రాష్ట్రంలోనే ఉండి అసెంబ్లీ స్పీకర్ పదవిలో చూడాలని కోరుకుంటున్నారని తాజాగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలముందుకొచ్చానని తెలిపారు. చంద్రబాబు, ప్రజల రుణంతీర్చుకుంటానని చెప్పారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ ప్రభంజనం సృష్టించబోతున్నారని సభలో ప్రకటించారు. .
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ”ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామ. మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో ఆయన్ను మనస్ఫూర్తిగా టిడిపిలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో చేర్చుకొంటున్నాం. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా? మీకు ఆమోద యోగ్యమా? ఏంటీ అరాచకం? ఏంటీ సైకో పాలన?” అంటూ ప్రశ్నించారు.
“గతంలో ఆయన్ను పోలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారు. రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రయత్నిస్తే చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారు. లేదంటే ఈరోజు ఆయన్ను మీరు చూసేవాళ్లు కాదు. అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” అంటూ చంద్రబాబు పిలుపిచ్చారు.
అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనితెలియజేస్తూ రఘురామను అందరి ఆమోదంతో టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.