త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సర్వీసులు అందిస్తున్న వందే భారత్ ట్రైన్‌ను నెల 15 సంక్రాంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మిగతా రైళ్ల కంటే వేగంగా ప్రయాణిస్తూ త్వరగా గమ్యస్థానానికి చేర్చడంతో పాటు ఏసీ, వైఫై సౌకర్యంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రోజూ ఈ ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది.
ప్రయాణికుల కోసం త్వరలో మరో మూడు వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఏయే మార్గాల్లో అందుబాటులోకి తీసుకురావాలనే విషయంపై అధికారులు కూడా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో విడతలో కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వందే భారత్ రైళ్ల కోసం డిపోల ఎంపిక, నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించారు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. ట్రైన్లలో ఎక్కువమంది తిరుపతికి ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్ నడపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కూడా త్వరగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. తిరుపతికి తిప్పడం వల్ల రైల్వేశాఖకు కూడా ఆదాయం భారీ మొత్తంలో వస్తుంది. దీంతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ నడపనున్నారు.
ఇక బెంగళూరు, పుణెలకు కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణెల మధ్య వందే భారత్ రైళ్లు నడపనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, పుణెలకు చాలా ట్రైన్లు నడుస్తుండగా, ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు ఆక్యూపెన్సీ సరిపోవడం లేదు. దీంతో ఆ రెండు నగరాలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.