తిరుమల శ్రీవారి ప్రస్తాదం లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమింఛాయారు. ఇక మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కూతరు పొలెనా అంజని కొణిదెలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పవన్ చిన్న కుమార్తె క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్‌పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు.
తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు పవన్.
ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం వెలుపల మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో బుక్‌ను రూపొందించినట్లు సమాచారం. రేపటి (గురువారం) వారాహి సభలో పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం తెలియజేయనున్నారు. దర్శనం తర్వాత అన్నదానం కేంద్రం వద్దకు చేరుకున్నారు. అన్నప్రసాదంలో అన్నప్రసాదాన్ని పవన్ స్వీకరించారు. అన్నదానంలో తనిఖీలు ముగించి అక్కడి నుంచి గాయత్రి నిలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు.
కాగా, రాష్ట్రంలో డిక్లరేషన్ విషయమై వివాదం నెలకొన్న వేళ జనసేనాని చేసిన పనితో ఒక విధంగా ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లైంది. ఇక స్వామివారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ నేరు తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఇదిలాఉంటే.. దాదాపు పదేళ్ల తర్వాత పవన్-అన్నా లెజ్నెవా కూతురు కనిపించడంతో ఆయన అభిమానులు ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో పవన్ చిన్న కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.