రేడియో ధార్మిక పధార్థాలు సహా పలు వస్తువులను రష్యాకు ఎగుమతిచేయడంపై జపాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలపై కొత్త ఆంక్షల విధింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ఆర్థిక, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
రేడియోధార్మిక పదార్థాలు, వ్యాక్సిన్లు, వైద్యపరికరాలు, రొబోట్లు, అణుధార్మిక పరికరాలు, చమురు, సహజవాయు అన్వేషణ పరికరాలు, టియర్‌గ్యాస్, ఫింగర్‌ప్రింట్ పౌడర్ వంటి వివిధ రసాయనాల ఎగుమతులను నిషేధించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 3 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది.
అలాగే 49 రష్యన్ కంపెనీలు, సంస్థలపై ఎగుమతి పరిమితులను విధిస్తున్నట్లు పేర్కొంది. క్రిమియా, సెవాస్టోపోల్లను స్వాధీనం చేసుకోవడం, ఉక్రెయిన్‌లో అస్థిరతకు వ్యతిరేకంగా రష్యాకు చెందిన 22 మంది వ్యక్తుల ఆస్తులను స్తంభింపచేస్తున్నట్లు తెలిపింది.
వీరిలో రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా ల్వోవా బెలోవా, ఉప ప్రధానులు ఆండ్రీ బెలౌసోవ్, డిమిత్రి చెర్నిషెంకో, న్యాయమంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షురాలు సహా ప్రముఖ రష్యన్ ట్రక్, బస్సు, ఇంజిన్ తయారీ సంస్థ కమాజ్, విమానాల తయారీ సంస్థ ఇర్కుట్, మాస్కోకు చెందిన క్షిపణి తయారీదారు, సరఫరా దారు అవన్గార్డ్ సంస్థలు ఉన్నాయి.