గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబైలోని దాదర్‌లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తనను జైలుకు పంపినా ధర్మం కోసం పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.
గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్‌పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో తాను వ్యాఖ్యానించినట్లు రాజాసింగ్ చెప్పారు. మహారాష్ట్రలో తాను మాట్లాడితే మంగళ్‌హాట్ పోలీసులు తనకు లేఖలు అందిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
