ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆప్ కు రాజీనామా చేశారు. ఆ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ దోస్తీని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.
సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తో కలిసి నడవాలని నిర్ణయించడంతో ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లైందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్థాపానికి గురైనట్టు ఇందిరా శోభన్ వెల్లడించారు.
ఖమ్మం సభకు వచ్చినప్పుడే కేజ్రీవాల్ ముందు తన సందేహాన్ని ఉంచానని ఆమె చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ బాయ్ కాట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
అంబేద్కర్ ఫోటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తాన్న కేసీఆర్ తో కలిసి ఈ దేశ ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారని ఆమె కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.
కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఇందిరా శోభన్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపై వ్యవహరించిన తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ 2021లో రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీలో చేరారు. కొన్ని రోజుల్లోనే ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఆమ్ ఆద్మీలో చేరారు. తాజాగా ఆప్ కు గుడ్ బై చెప్పిన ఇందిరా శోభన్ త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు.