సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గర్జనలో ఇచ్చిన హమీని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘విశాఖ ఉక్కు గర్జనలో,అన్ని రాజకీయ పార్టీలు (బీజేపీయేతర) వైజాగ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవడానికి, అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చేపట్టడానికి పోరాటం చేస్తామని హామీ ఇచ్చాయి. వారు చేస్తారని ఆశిస్తున్నాను #Savevizagsteel’అని జేడీ నినదించారు.
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా ట్యాగ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లక్ష్మీనారాయణ ఈ విషయమై రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలురు. కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరాలని ఆయన సూచించారు. పార్లమెంటు వేదికగా పోరాడతామని చెప్పారని గుర్తు చేస్తూ ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
అయితే, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ధోరణితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ప్రయివేటీకరిస్తామని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడాదికిపైగా కార్మికులు దీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన వీవీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నుంచే పోటీచేస్తానని, అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు.
