తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూశారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా చాటిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన్ను కాపడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన మృతి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు
1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కాశినాథుని విశ్వనాథ్ జన్మించారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. బాల్యం నుంచి చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా, చదువుతూపోయేవారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు.
విశ్వనాథ్‌కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరుపెట్టుకున్న ఆయన మనసు దర్శకత్వం వైపు మళ్లింది. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్‌గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ఆత్మగౌరవం’ చిత్రంతో కే విశ్వనాథ్‌ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి.
తొలి చిత్రంలోనే తనదైన బాణీని ప్రదర్శించారు విశ్వనాథ్. నాటి మేటినటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో చిత్రాలు రూపొందించారు. అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్‌బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచీ తపించేవారు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకొనేవారు. తెలుగునాట శోభన్‌బాబు, చంద్రమోహన్, కమల్‌హాసన్ వంటివారు స్టార్డమ్ పొందటానికి ఆయన చిత్రాలు కారణమయ్యాయి.
విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.
కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటాడు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్.. వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.
సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ,. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా స్వీకరించారు.