ఎన్నో ఏళ్ళకు నిరాధరణకు గురైన గుంటూరు రైల్వే డివిజన్‌కు మహర్ధశ పట్టింది.. కేంద్రం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో అభివృద్ధి పనులకు సింహభాగం కేటాయింపులు జరిగాయి. గత ఏడు, ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే రైల్వే శాఖనే సొంతంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. కేవలం మూడు ప్రాజెక్టులకు రూ.1,242 కోట్లు కేటాయించడం విశేషం.
ఇవికాక స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక సదుపాయాల పనులకు పెద్దమొత్తంలోనే నిధుల కేటాయింపు జరిగినట్లు- రైల్వే వర్గాలు తెలిపాయి. గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్, నడికుడి – శ్రీకాళహస్తి, గుంటూరు – బీబీనగర్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. గత కొన్ని దశాబ్ధాలుగా డిమాండ్‌లో ఉన్న గుంటూరు – బీబీనగర్ డబ్లింగ్ని ఈ దఫా పింక్‌బుక్‌లో చోటు కల్పించి రూ.60 కోట్లు కేటాయించింది. దీంతో ఈ ప్రాజెక్టుని చేపట్టడానికి తొలి అడుగు వేసినట్లయింది.
గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్ పనులకు సంబంధించి వివిధ సెక్షన్లను ఈ ఏడాది పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో నిధులు ఇచ్చింది. గుంటూరు రైల్వే డివిజన్లో నడికుడి మార్గం ఎంతో కీలకమైనది. తెలంగాణలోని సికింద్రాబాద్ జంక్షన్‌ని అనుసంధానం చేసే మార్గమిది. ఇప్పటికే విద్యుద్దీకరణతో సింగిల్ లేన్ మార్గం అందుబాటు-లో ఉన్నా లైన్ కెపాసిటీ- 100 శాతం దాటింది.
ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో గుంటూరు – బీబీనగర్ సెక్షన్ డబ్లింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎట్టకేలకు రైల్వే శాఖ దీనికి కార్యరూపం ఇచ్చింది. 248 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గం నిర్మించాలి. దీనిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే బోర్డు అంబరెల్లా వర్కు కింద శాంక్షన్ ఇచ్చింది. రూ.2,480 కోట్ల నిధులు అవసరం కాగా తొలి విడతగా రూ.60 కోట్లు మంజూరు చేసింది.
డబ్లింగ్ పూర్తి అయితే తెనాలి – విజయవాడ – కాజీపేట మీదగా సికింద్రాబాద్ వెళ్లే పలు రైళ్లను గుంటూరు మీదగా మళ్లించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గరిష్ఠ వేగం కూడా 110 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు పెరుగుతుంది. దాంతో వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లని కూడా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది.
నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.202 కోట్ల నిధులను రైల్వే శాఖ కేటాయించింది. దీంతో ఈ ప్రాజెక్టుకి సంబంధించి పురోగతిలో ఉన్న వివిధ సెక్షన్లలో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి 50 శాతం నిధులను సమకూర్చాలి.
వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైల్వే శాఖ సొంతంగా దీనిని పూర్తి చేయాలని నిర్ణయించింది. గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టుని డివిజన్ పరిధిలో వివిధ సెక్షన్లను ఈ ఏడాది పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టు-కున్నారు. దీంతో రూ.980 కోట్ల నిధులను రైల్వే శాఖ కేటాయించింది. ఈ దృష్ట్యా ఈ ఏడాది చివరికల్లా దిగువమెట్ట వరకు అన్ని సెక్షన్లు పూర్తి అవుతాయని అంచనా.