తమ పార్టీ గురించి మంత్రి కేటీఆర్ చులకనగా మాట్లాడడంతో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి అధికార పక్షంకు ఊహించని షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో 50 స్థానాలలో పోటీచేసి, కనీసం 15 స్థానాలలో గెలుపొంది అసెంబ్లీకి వస్తామని సవాల్ చేశారు. దానితో బిఆర్ఎస్ సభ్యులు నివ్వెరపోయారు.
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడుగురు సభ్యులున్న పార్టీకి గంటలకద్దీ సమయం ఇవ్వడం భావ్యం కాదని ఎంఐఎంను ఉద్దేశిస్తూ స్పీకర్ కు సూచించారు. దీంతో అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని, కనీసం 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఉండేటట్లు చూస్తామన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో వరుసగా మూడోసారి కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాలేరని అంటూ పరోక్షంగా సంకేతం ఇచ్చారు.
జాతీయపార్టీ కావాలంటూ దేశంలో పలు రాస్త్రాలలో డిపాజిట్లు రాకపోయినా ఎక్కువ నియోజకవర్గాలలో పోటీచేస్తున్న ఎంఐఎం తెలంగాణాలో మాత్రం పాతబస్తీ ప్రాంతంలోని 8 నియోజకవర్గాలను మించి పోటీచేయడం లేదు. రాష్ట్రంలో ముస్లింల ప్రాబల్యం గల నియోజకవర్గాలలో కూడా పోటీచేయడం లేదు. కేసీఆర్ తో కుదిరిన ఒప్పందం మేరకే ఆ విధంగా చేస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు.
ఎంఐఎం పోటీచేసే నియోజకవర్గాలలో హిందువుల ఓట్లను చీల్చే అభ్యర్థులను కేసీఆర్ నిలబెడుతున్నారు. దానితో ఎంఐఎం అభ్యర్థులు కనీసం 7 చోట్ల సునాయాణంగా గెలుపొందుతున్నారు. అందుకు ప్రతిగా మిగిలిన నియోజకవర్గాలలో ముస్లింలు గంపగుతుగా బిఆర్ఎస్ కు వేసేవిధంగా ఎంఐఎం సహాయపడుతుంది.
ఇదేజరిగితే, ఎంఐఎం ఎన్ని సీట్లు గెల్చుకొంటుందో వేరే విషయం గాని, ఆ 50 సీట్లలో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం మాత్రం కష్టం కాగలదు. అప్పుడు బిజెపి అభ్యర్థులు హెటెలికగా గెలుపొందే అవకాశం కలుగుతుంది. అందుకనే అక్బరుద్దీన్ వాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఎవ్వరు స్పందించడం లేదు.
బిఆర్ఎస్ నాయకత్వాన్ని బెదిరించడానికి ఆ విధంగా అన్నారా? లేదా నిజంగానే తమ సొంత బలం చుపెట్టుకోవాలను అనుకొంటున్నారా? ఎన్నికలు వస్తేగాని తెలియదు. ఏదిఏమైనప్పటికీ ఎంఐఎం – బిఆర్ఎస్ బంధం అంతతేలికగా తెగిపోయెడిది కాదని పరిశీలకులు చెబుతున్నారు.
బిఆర్ఎస్ నాయకత్వాన్ని `బ్లాక్ మెయిల్’ చేయడం ద్వారా తనకు అవసరమైన పనులు చేయించుకోవడం ఎంఐఎం సోదరులకు బాగా తెలుసని వాఖ్యానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆ విధంగా అధికారం చెలాయించేవారని, ఇప్పుడు కేసీఆర్ హయాంలో కూడా అదేవిధంగా చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.