టర్కీ, సిరియాలలో ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. దీంతో 4000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6వేల మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇంకెంతో మంది భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు.
తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం టర్కీలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయపడ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొన్నది. సిరియాలో భూకంపం వల్ల సుమారు 1451 మంది మరణించారు. మరో 3531 మంది గాయపడ్డారు.
వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీలో ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. టర్కీ, సిరియాలలోని ప్రభావిత నగరాల్లో ఎక్కడ చూసినా బాధితుల హాహాకారాలు, అంబులెన్సుల సైరన్ల మోతలే వినిపించాయి. తమ వారిని కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న బాధితుల దృశ్యాలే కనిపించాయి.
ఇక టర్కీ పొరుగునే ఉన్న సైప్రస్, లెబనాన్ దేశాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భూప్రకంపనలకు భయపడి లిబియాలోని బీరుట్, ట్రిపోలీ నగరాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, భవనాల లోపలి నుంచి కార్లను తీసి బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు.
టర్కీలో ఓ ఆసుపత్రి భూకంప తీవ్రతతో కుప్పకూలింది. దీనితో అతి కష్టం మీద ఇక్కడి రోగులను, శిశువులను సిరియాలోని కొన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టర్కీలోని అదానా ప్రాంతంలో పరిస్థితి భయానకంగా మారింది. పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురి ఆర్తనాదాలు రక్షించాలనే దీనమైన పిలుపులతో ఈ ప్రాంతం అంతా విషాదభరితం అయింది. దియార్బకిర్కు తూర్పు దిక్కున ఉన్న ప్రాంతంలో కుప్పకూలిన భవనాలతో ఆ ప్రాంతం అంతా కాంక్రీట్ పర్వతాల తరహాలో చెక్కుచెదిరిపోయింది.
ఇప్పటి భూకంప తీవ్రతతో మలటయా ప్రాంతంలోని 13 వ శతాబ్ధపు పురాతన ప్రఖ్యాత మసీదు పాక్షికంగా కూలింది. ఇక్కడనే ఓ 14 అంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టం అయింది. 92 కుటుంబాలు 28 అపార్ట్మెంట్లలో ఇక్కడ నివసిస్తున్నారు. గజియన్టెప్లో 2200 ఏండ్ల నాటి హిల్‌టాప్ రాజప్రాసాదం దెబ్బతింది. దీనిని అప్పట్లో రోమను సైనికులు కొండపై నిర్మించుకున్నారు.
ప్రధాని మోదీ భరోసా
టర్కీ,సిరియాల్లో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వాటికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు.
టర్కీ, సిరియాకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన రెండు టీమ్స్, డాక్టర్లు, పారామెడిక్స్ తో కూడిన మెడికల్ టీమ్స్, రిలీఫ్ మెటీరియల్, మెడిసిన్ పంపుతామని కేంద్రం తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లలో 100 మంది చొప్పున సిబ్బంది ఉంటారని వారు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లలో సహకరిస్తారని చెప్పింది.