శక్తివంతమైన భూకంపంతో టర్కీ, సిరియాలల్లో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. భవనాలన్నీ కుప్పకూలి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పటి నుంచి దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. వేలాది మంది ప్రజలు తాత్కాలిక శిబిరాలు, స్టేడియాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఎముకలు కొరికే చలి, మంచుతో మరింత అల్లాడిపోతున్నారు. తినడానికి ఆహారం, తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలకు మించి 21 వేలు దాటింది. టర్కీలో 17,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 4,000 మంది మృతి చెందారు
సహాయక చర్యల్లో 1,10,000 మందికి పైగా పాల్గొంటున్నారు. దాదాపు 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లు రంగంలోకి దిగాయి. భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు పలు దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. టర్కీలోని హతాయ్ ప్రావిన్సులో భారత సైన్యం తాత్కాలిక ఆసుపత్రిని నెలకొల్పి అత్యవసర వైద్య సేవలను అందజేస్తోంది.
అవసరమైన వారికి అక్కడే శస్త్రచికిత్సలను నిర్వహిస్తోంది. తాత్కాలిక ఆసుపత్రిలో ఎక్స్రే మెషీన్లు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి. గాజియాంతెప్ ప్రాంతంలో ఆరేళ్ల పాపను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. కాంక్రీటు శిథిలాలను పగులగొట్టే యంత్రాలను వినియోగించడంతో పాటు ఎక్కడో ఇరుక్కుని ఉన్నవారి హృదయ స్పందనను గుర్తించగలిగే రాడార్లను కూడా సైనిక బలగాలు వాడుతున్నాయి.
గత 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన భూకంపాలలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరిసారిగా టర్కీలో పెను భూకంపం 1939లో సంభవించింది. ఇప్పుడు అదే స్థాయిలో భూకంపం చోటుచేసుకుంది. 20 శతాబ్దం మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో 1960లో 9.5 తీవ్రతతో సంభవించిన భూకంపమే అతిపెద్దది.
కాగా, సోమవారం సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ధాటికి టర్కీ 5 నుంచి 6 మీటర్ల మేర పక్కకు జరిగినట్లు ఇటలీకి చెందిన సిస్మాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డగ్లియాని తెలిపారు. టెక్టానిక్ ప్లేట్స్ మధ్య రాపిడి కారణంగానే భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. సిరియాతో పోలిస్తే టర్కీనే 5 నుంచి 6 మీటర్లు భౌగోళికంగా పక్కకు జరిగినట్లు తెలిపారు.