టీపీసీసీ రేవంత్ రెడ్డి తన సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వివాదాలకు కేంద్రం అవుతున్నారు. ఆయన వాఖ్యాలను ఆయన పార్టీ వారీ సమర్ధింపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రగతి భవన్‌ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్.. శుక్రవారం కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఐదో రోజు కొత్త లింగాల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఈ 12 మంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో ఉరి తీయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఈ 12 మంది ఎమ్మెల్యేలను డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. జీవితంలోనే ఎమ్మెల్యే అనే పదానికి వాళ్లకు దూరం చేసి.. రాజకీయంగా బొంద పెట్టాలంటూ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.
పార్టీ ఫిరాయింపులను అడ్డుకున్నప్పుడే తెలంగాణలో ప్రజాస్వామ్యం బతుకుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి సీఎం కేసీఆర్ అక్రమంగా సంపాధించిన వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఫిరాయింపుల మీద రాజకీయ పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. ప్రజా కోర్టులో నిలదీయాలని.. పార్టీలు మారుతున్న నాయకులను ప్రజా కోర్టులో ఉరి తీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనపై మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం ఎవరికీ ఉండదంటూ ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలోనూ హాట్ హాట్ చర్చ సాగింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటని అధికార పార్టీ సభలో నిలదీయటంతో.. ఆ పార్టీ నేతలు కూడా ఏమీ చెప్పలేక నీల్లు నమలాల్సి వచ్చింది.