నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో మరో హత్యాయత్నానికి ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇంట్లో పేలుడు పదార్థాలను గుర్తించిన పోలీసులు, సదరు మహిళ ఇంట్లో పేలుళ్ల కోసం ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ ఎలా వచ్చాయి అన్న దానిపై దర్యాప్తు చేయగా కొత్త విషయం బయటపడింది.
గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేసిన నిందితుడు సదరు మహిళ ఇంట్లో ఈ పేలుడు పదార్థాలను దాచినట్టుగా తెలియడంతో పోలీసులు ఒక్కసారి షాక్ తిన్నారు. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి 2022 ఆగస్టు 2వ తేదీన రాత్రి తుపాకీని నడుము వెనుక, కత్తిని జేబులో పెట్టుకొని నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు.
అక్కడ గస్తీ కాస్తున్న సిబ్బంది కళ్ళు కప్పి మూడో అంతస్తుకు చేరుకున్నాడు. ఇక అక్కడ ఉన్న జీవన్ రెడ్డి పైకి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? అని అడిగితే వెంటనే కిందికి వెళ్లిపోయాడు. ఇక ఎమ్మెల్యే కూడా కిందికి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యేతో గొడవకు దిగిన సదరు నిందితుడు ఎమ్మెల్యే పై దాడి చేశాడు.
అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకోగా అతని జేబులో కత్తి, నడుము వెనుక తుపాకీ దొరికాయి. ఘర్షణలో జీవన్ రెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇదిలా ఉండగానే తాజాగా మహిళ ఇంట్లో నిందితుడు ప్రసాద్ గౌడ్ పేలుడు పదార్థాలు ఎందుకు దాచాడు అనేది పోలీసులకు అర్థం కావడం లేదు.
నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు 95 జిలెటిన్ స్టిక్స్, పది డిటోనేటర్లను దాచి పెట్టాడు. ఇక ఇదే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మహిళ ఇంట్లో సోదాలు చెయ్యగా పేలుడు పదార్ధాలు బయట పడ్డాయి.
సదరు మహిళను విచారించగా ఆమె ప్రసాద్ గౌడ్ పేరును చెప్పింది. అవి అతనే తన ఇంట్లో దాచిపెట్టమని చెప్పారని, ఇక వాటిని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని కూడా చెప్పాడని ఆమె పేర్కొన్నారు . ఇక గతంలో ప్రసాద్ గౌడ్ తుపాకీ కొనుగోలు కోసం బొంత సుగుణ డబ్బులు కూడా ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.
బెయిల్ పై వచ్చిన తర్వాత సుగుణతో కలిసి ప్రసాద్ గౌడ్ మళ్ళీ పేలుడు పదార్థాలు తెప్పించినట్టు తెలియడంతో, మరోసారి ఎమ్మెల్యే పై హత్యాయత్నం చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రసాద్ గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇక బొంత సుగుణను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమెతోపాటు ప్రసాద్ గౌడ్ పై మరో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.