తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు. `ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మూడో రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అనపర్తి దేవీ చౌక్ వద్ద బహిరంగ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసు వ్యాన్ ని నిలిపారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు కాలినడకనే దేవీ చౌక్ కి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఘటనలపై డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో అనపర్తి, బిక్కవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు బుక్ చేశారు. అనపర్తి ఘటనలో చంద్రబాబుని ఏ 1 గా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ 2 గా, జవహర్ ఏ 3 గా, ఏ 4 గా స్వామినాయుడు, ఏ 5 గా చినరాజప్ప, ఏ 6 గా మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఏ 7 గా జ్యోతుల నవీన్, ఏ 8 గా మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, ఏ 9 గా మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావులపై కేసులు నమోదయ్యాయి.
శుక్రవారం అనపర్తిలో టీడీపీ నిర్వహించిన సభకు తాము అనుమతి ఇవ్వలేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. అనపర్తి దేవీచౌక్ లో టీడీపీ అధినేత చంద్రబాబు సభకు అనుమతి లేకపోయినా నిర్వహించారని ఐజీ పాలరాజు తెలిపారు. రోడ్డుపై సభ నిర్వహించడానికి వీళ్లేదని ముందే చెప్పామని, ప్రత్యామ్నాయంగా రెండు సభా స్థలాలు కూడా చూపించామని పేర్కొన్నారు.
తాము చెప్పిన విషయాలపై పార్టీ నేతలతో చర్చించి చెబుతామన్న నేతలు చివరకు రోడ్డుపైనే సభ నిర్వహించారని తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, కేవలం ర్యాలీగా వెళ్లొచ్చని, సభకు అనుమతి లేదని టీడీపీ అధినేతకు కూడా సమాచారం అందించామని చెప్పారు.
ఇవేమీ పట్టించుకోకుండా బహిరంగ సభ నిర్వహణకు పూనుకోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ యత్నంలోనే బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. కొందరు రాళ్లు విసరడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారన్నారు. రోడ్డుపై సభలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని… నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తామంటే చట్టం తనపని తాను చేస్తుందని ఐజీ స్పష్టం చేశారు.
కాగా.. పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. టీడీపీ శ్రేణులని ఇబ్బంది పెట్టిన పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారని పేర్కొంటూ కేసు నమోదు చేయకపోతే.. ప్రైవేటు కేసులు నమోదు చేస్తామని అంటున్నారు.