ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 35కు పైగా వాగులు, వంకలు గోదావరిలో కలవడం లేదని, 22 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ గతంలో కంటే ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నది.
ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాచలం వరకు బ్యాక్‌వాటర్ 43 అడుగుల మేర నిలిచి ఉంటాయని తెలిపింది. భద్రాచలం ముంపు నివారణకు సుమారు రూ.1,629 కోట్లు అవసరం అవుతాయని నిపుణుల కమిటీ అంచనా వేసింది.
నిరుడు సంభవించిన భద్రాచలం వరదలపై అధ్యయనం చేసి, నివారణ చర్యలపై సిఫార్సులు చేసేందుకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు నేతృత్వంలో ప్రత్యేక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తొలుత మధ్యంతర నివేదికను సమర్పించిన కమిటీ తాజాగా పూర్తిస్థాయి నివేదికను సర్కారుకు అందజేసింది. వరద నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించింది. ప్రస్తుతం ఉన్న కరకట్టలను మరింత పటిష్టం చేయాలని, 15 మైనర్, 2 మీడియం, 6 మేజర్ క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని తెలిపింది.
గోదావరికి కుడివైపు బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వరకు, ఎడమ వైపు భద్రాచలం మండలం సుభాష్‌నగర్ కాలనీ నుంచి దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామం వరకు ఇరువైపులా దాదాపు 16 కి.మీ. పొడవునా రక్షణ గోడలు, కరకట్ట నిర్మాణం చేపట్టాల్సి ఉన్నదని నివేదికలో సూచించింది.
బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వ
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పై జనవరి 25న ఢిల్లిలో జరిగిన సమావేశాన్ని గుర్తు చేస్తూ పోలవరం ఉమ్మడి ప్రాజెక్టు పై ఇరురాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే త్వరగా నిర్వహించాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ అదేశించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆధ్రపప్రదేశ్ ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలని సూచించింది.
జనవరి 25న ఉమ్మడి సర్వేకు ఆంధ్ర తెలంగాణ అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు పనుల్లో వేగం పెరగపోవడంతో త్వరగా సర్వే పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖలను ఆదేశిస్తూ లేఖలు రాసింది.