కరోనా విజృంభణ సమయంలో ఆరోగ్య రక్షణ కార్యకర్తల్లో ముందు వరుసలో ఉండి రోగులకు చికిత్స చేసి, వారు కోలుకోవడంలో సహాయం చేసిన నర్సులు ప్రస్తుతం అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రిక్ నర్సింగ్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకార కరోనా చికిత్సలో పాల్గొన్న నర్సులు ప్రస్తుతం అలసట, ఒత్తిడి, నిద్రలేమి, నిరాశతోపాటు భయం, కోపోద్రేకం, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. కరోనా చికిత్స నిర్వహిస్తున్న సమయంలో ఎనలేని మానసిక సంఘర్షణకు గురికావడంతో నర్సులు ప్రస్తుతం వీటితో బాధపడుతున్నారని అధ్యయనం తెలిపింది.
భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్సులు ఈ రుగ్మతలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయన నివేదికను జి బాలమురుగన్, జి రాధాకృష్ణన్, ఎం విజయరాణి రూపొందించారు. ఈ అధ్యయనంపై పనాజీలో తాజాగా ఇండియన్ సొసైటీ ఆఫ్ సైకియాట్రిక్ నర్సెస్ (ఐఎస్‌పిఎన్) ఒక మీడియా సమావేశం నిర్వహించింది. నర్సుల దుస్థితిని ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కరోనా మహమ్మారి నర్సుల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిందని ఐఎస్‌పిఎన్ అధ్యక్షులు కె రెడ్డమ్మ తెలిపారు. ‘కరోనా సమయంలో రోగులకు అండగా నర్సులు నిలిచారు. నర్సులు ధరించిన పిపిఇ కిట్ల కారణంగా వారు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లలేకపోయారు’ అని తెలిపారు. కరోనా సమయంలో నర్సులు చేసిన కృషికి నివాళిగా ఈ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ‘అంకిత దినోత్సవం’గా పాటిస్తామని రెడ్డెమ్మ వెల్లడించారు.