దేవుని ముందు అందరూ సమానులే అని, కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగిందని త్రిదండి చిన్న జీయర్ స్వామి చెప్పారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
ఉదయం నుండి యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ట, ధ్వజ స్తంభ, ఆలయ గోపురం ప్రతిష్ఠ, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలతో గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రతిష్ఠాపన పూర్తి కావడంతో ఇక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రజలకు దర్శనం ఇస్తారని చెప్పారు. అందరూ ఆ దేవుడిని దర్శించుకొని, తరించాలని సూచించారు. మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడు, అందుకే దేవుడు అందరివాడు అన్నారు. దైవ సన్నిధి ఆనందాన్ని పెంచుతుందని, అందరికి పంచుతుంది తెలిపారు.
ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకున్న తిరుమలాయ పల్లి గ్రామస్థులు అభినందనీయులు అని చెప్పారు. గ్రామస్తులు పూనుకున్నారు, ప్రభుత్వం సహకరించిందని పేర్కొన్నారు. ఈ మహత్కార్యానికి పూనుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి, తిరుమలాయ పల్లె ప్రజలకు అభినందనలు తెలిపారు.