ప్రధాన ఎన్నికల కమిషనరు, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీయేే ఎన్నికల సంఘంలో నియామకాలను చేపట్టాలని స్పష్టం చేసింది.
ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
సిఇసి, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రారు, జస్టిస్ సిటి రవికుమార్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది.
ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చేంతవరకు త్రిసభ్య కమిటీ విధానమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రతిపక్ష నేత హౌదా ఎవరికీ లభించనప్పుడు, ప్రతిపక్షంలో అతి పెద్ద పార్టీకి కమిటీలో ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
అయితే, ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ, సిఇసిల తొలగింపు మాదిరే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని ధర్మాసనం ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయపడింది.
రాజ్యాంగ పరిధిలోనే ఇసి పని చేయాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది. ‘మీడియాలోని ఒక సెక్షన్ తమ అమూల్యమైన పాత్రను మరచి, సిగ్గులేకుండా పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.
రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో ఎన్నికల కమిషనర్ల స్వతంత్రత, ఎన్నికల్లో పెరుగుతున్న ధన బలం, నేరపూరిత రాజకీయాలు వంటి కొన్ని అంశాలపై వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ఎన్నికల కమిషన్‌ను ఒక పావుగా వాడుకోవాలని ఎప్పుడూ ప్రయత్ని స్తుంది.
‘ఇసి స్వతంత్రంగా ఉండాలి. అది స్వతంత్రతను క్లెయిమ్ చేయదు. ఆపై అన్యాయంగా ప్రవర్తిస్తుందని పేర్కొంది.’చట్టబద్ధ పాలనకు హామీ ఇవ్వని ఇసి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాని విస్తృత అధికారాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించినట్లయితే, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొంది.
‘తప్పుడు మార్గాలను సమర్థించలేం. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యం అన్న అబ్రహం లింకన్ నిర్వచనాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ఉటంకించింది.
సిబిఐ అధిపతి, లోక్‌పాల్ నియామకాల తరహాలోనే సిఇసి, ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలని సుప్రీం స్పష్టం చేసింది. శక్తివంతమైన తుపాకీ కన్నా ఓటు చాలా శక్తివంతమైనదని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. బలహీనంగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.