బెలారస్ మానవహక్కుల ఉద్యమకారుడు, 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల్లో ఒకరైన అలెస్ బియాలియాట్ స్కీకి బెలారస్‌లోని ఓ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన స్థాపించిన వియస్నా మానవ హక్కుల కేంద్రం బెలారస్లో పౌర హక్కుల కోసం పోరాడుతోంది.
బియాలియాట్ స్కీతోపాటు వియస్నా కేంద్రానికి చెందిన మరో ముగ్గురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. వీరు పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనీ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనీ ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
2020లో దేశాధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకషెంకో ఎన్నికైనప్పుడు దేశమంతటా పెద్దఎత్తున నిరసనలు రేగాయి. ఆ అల్లర్లలో 35,000 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పట్లో అరెస్టయిన 60 ఏళ్ల బియాలియాట్ స్కీ, ఆయన సహచరులు గత 21 నెలలుగా జైలులోనే ఉన్నారు.
వారందరినీ కోర్టు ముందు హాజరుపరిచారు. బెలారస్ ప్రభుత్వ ఏజెన్సీబెల్టా న్యాయస్థానం సుదీర్ఘ జైలు శిక్ష విధించడాన్ని ధ్రువీకరించింది. కాగా బిలియాట్సి మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సాహానికి గుర్తింపుగా నోబెల్ పురస్కారాన్ని పొందారు.దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపాలని బియాలియాట్ స్కీ ప్రభుత్వానికి కోర్టులోనే విజ్ఞప్తిచేశారు. బియాలియాట్ స్కీ బృందానికి జైలు శిక్షలు విధించడాన్ని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా నిరసించాయి.