కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.
ప్రజల్లో తిరిగినా తనపై స్టేట్ మెంట్ ఇచ్చినా చెరుకు సుధాకర్‌ను చంపడంతో పాటు ఆయన కొడుకు హాస్పటల్ సైతం ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోమని చంపేయడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లో హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని తాను ఆపలేనని హెచ్చరించారు.
ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చెరుకు సుధాకర్ తనయుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. దాదాపు 2 నిమిషాలపాటు బూతులు తిట్టారు.
తాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా పని చేస్తున్నారని, తనపై ఆ భాష ఏంటని సుధాకర్ ప్రశ్నించారు. పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకట్‌రెడ్డి డకౌట్ అయిన వికెట్ అంటూ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకట్‌రెడ్డిపై అధిష్ఠాన మే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి మతి ఉండి మాట్లాడాడో, మతిలేక మాట్లాడాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.
కాగా, తనతో పాటు తన తండ్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను చంపేస్తారంటూ ఫోన్లో బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుహాస్ నల్లగొండ వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. మరోవంక, చెరుకు సుధాకర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను నల్లగొండలో బీసీ విద్యార్థి సంఘం నేతలు దహనం చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండేవారు. కానీ, మునుగోడు ఉపఎన్నిక ముందు వరకు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో చెరుకు సుధాకర్‌కు ప్రాధాన్యత పెరుగుతుండడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కసు వెళ్లగక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నకిరేకల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ బలపడితే తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోవడం కష్టం అవుతుందని, ఎలాగైనా చెరుకు సుధాకర్‌కు చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చెరుకు సుధాకర్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడంతో ఆ ఎత్తులు పనిచేయడం లేదు.