ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం కవిత రేపు ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత బినామీ వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లైని నిన్న ఈడీ అరెస్టు చేసింది. ఈడీ విచారణలో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనని ఒప్పుకున్నాడు.
కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆమె పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. రామచంద్ర పిళ్లైను 5 రోజుల కస్టడీ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది.
పిళ్లై, ప్రేమ్రాహుల్లు కవితకు బినామీలని స్పష్టం చేసింది. పిళ్లైని రెండు రోజులపాటు విచారించిన తర్వాత సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే వ్యాపారంలో చేరామని అరుణ్ పిళ్లై, ప్రేమ్రాహుల్ తమ విచారణలో అంగీకరించారని తెలిపింది.
పిళ్లై విచారణలో.. కవిత, పిళ్లైల మధ్య లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది. పిళ్లై కవిత ప్రయోజనాల కోసం పనిచేశాడని ఈడీ తేల్చింది. దాంతో రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఈడీ ప్రస్తావించింది. దానిపై విచారణకు రావాలని కవితను ఈడీ కోరింది. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు. అయితే, రామచంద్ర పిళ్లై ఈ నెల 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నాడు.