తైవాన్ అంశాన్ని ముందుకు తేవడం ద్వారా ఆసియాలో ఉక్రెయిన్ తరహా సంక్ష్షోభాన్ని పునరావృతం చేయాలని చూస్తే సహించేది లేదని చైనా హెచ్చరించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పిసి) సమావేశాలు జరుగుతున్న సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మీడియాతో మాట్లాడుతూ కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై చైనా వైఖరిని పునరుద్ఘాటించారు. చైనా-రష్యా బంధం వల్ల ఏ దేశానికి ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు.
మూడవ పక్షంగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అసమ్మతిని ఎగదోయడం వంటి చర్యలకు తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు. ప్రపంచానికి ద్రవ్యోల్బణం ఇప్పుడొక పెను ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు తమ ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడాలని, ఈ విషయంలో ప్రజల వాణిని అవి చెవికెక్కించుకోవాలని అయన హితవు పలికారు.
తైవాన్ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి లేదని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ ప్రజానీకంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని చెబుతూ ఐరోపాలో సెక్యూరిటీ గవర్నెన్స్ పెరిగిపోతోందని కిన్ గాంగ్ చెప్పారు.
యుద్ధం కన్నా శాంతికి, ఆంక్షల కన్నా చర్చలకు, రెచ్చగొట్టే చర్యల కన్నా చర్చలకే తాము అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఆయన తెలిపారు. చైనా దౌత్యంలో దయ, సుహృద్భావాలకు కొదవ లేదు, అయితే జిత్తులమారి నక్కలు, తోడేళ్లు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటితో ఘర్షణ పడడం తప్ప చైనాకు మరో మార్గం లేదన్నారు.
మాతృ భూమి రక్షణకు వారితో ముఖాముఖి తలపడక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. చైనా ఆధునీకీ కరణ అంటే శాంతి, అభివృద్ధి, సహకారం, పరస్పర ప్రయోజనాలు, మానవాళికి ప్రకృతికి మధ్య సామరస్యత ద్వారా సాధించేదే తప్ప యుద్ధం, వలసాధిపత్యం, వనరులను కొల్లగొట్టడం వంటి వాటికి పాల్పడడం కాదని కిన్ గాంగ్ అమెరికానుద్దేశించి వ్యంగ్యంగా పేర్కొన్నారు.
పశ్చిమ దేశాల ఆధునీకరణకు భిన్నమైన కొత్త పంథా తమది అని ఆయన చెప్పారు. బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ ఉన్నత ప్రమాణాలతో, మంచి ఉద్దేశంతో చేపట్టినదని పేర్కొంటూ మిగిలిన భాగస్వాములనందరినీ కలుపుకుంటూ, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ప్రపంచంతో పంచుకుంటుందని చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ జనాభాలో 80 శాతానికి, ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 70 శాతానికి పైగా ప్రాతినిధ్యం కలిగి వున్నాయని, కాబట్టి వర్థమాన దేశాల ప్రజలు మెరుగైన జీవితం కలిగివుంటే హక్కు ను కోరుకోవడం తప్పేమీకాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో వర్థమాన దేశాలు తమ వాణిని గట్టిగా వినిపించే అవకాశం ఉండాలని పేర్కొంటూ తగిన ప్రాతినిధ్యం కూడా ఉండాల్సిన అవసరముందని చెప్పారు.
కాగా, ఇండో-పసిఫిక్ వ్యూహం ద్వారా ‘చైనాను ముట్టించడానికి’ అమెరికా ప్రయత్నిస్తోందని కిన్ గాంగ్ విమర్శించారు. ”ప్రాంతీయ భద్రతను పరిరక్షించేందుకే ఇండో-పసిఫిక్ వ్యూహం అని వారు చెబుతున్నారు, కానీ, వాస్తవానికి, ఆ వ్యూహం ఘర్షణలను రెచ్చగొడుతోంది. నాటోకు ఆసియా-పసిఫిక్ వర్షన్‌ను సృష్టించాలని భావిస్తోంది”అని ఆరోపించారు.