భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని, రాజధానిలో ఒక్క ఎకరం అమ్మినా ఊరుకునేది లేదని అంటూ అమరావతి ప్రాంత రైతులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి మాత్రమే భూములను వినియోగించాలని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాజధాని ప్రాంతం తుళ్లూరులోని రైతు దీక్షా శిబిరంలో రాజధాని మహిళా రైతులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రభుత్వంపై నిరసన తెలిపారు. రాజధానిని విశాఖకు మార్చుతున్నామని పదే పదే ప్రకటించడం, రైతులిచ్చిన భూములను అమ్మకానికి పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతేనని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు చేస్తున్న దీక్షలు బుధవారంతో 1177వ రోజుకు చేరాయి. సిఆర్డిఎ పరిధిలోని నవులూరు సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కన పదెకరాలు, దొండపాడు దగ్గర పిచికలపాలెం వద్ద నాలుగెకరాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.
నవులూరు దగ్గర ఎకరా భూమి ధర రూ. 5. 94 కోట్లు, పిచికలపాలెం దగ్గర రూ. 5. 41 కోట్లుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతు కాటా అప్పారావు, మరికొందరు మహిళా రైతులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అమరావతి రాజధానిపై విషం చిమ్ముతూనే ఉందని మండిపడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా రైతులను ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. మూడేళ్లుగా రైతులు మానసిక వేదనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, అనేక మంది చనిపోయారని, అయినా ప్రభుత్వానికి జాలి, దయ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లో దీక్షలు సాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులు వెలిగించారు.