వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో పొత్తు ఏర్పరచుకొని పోటీచేయాలని ప్రయత్నిస్తూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అందుకు బిజెపి విముఖంగా ఉండటం, జనసేనలో సహితం స్పష్టత లోపించడంతో వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఐదు ఎమ్యెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో వామపక్ష అభ్యర్థులకు ఓట్లు వేయమని పిలుపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది.
టిడిపి మూడు గ్రాడ్యుయేట్ల స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టగా, రెండు ఉపాధ్యాయ స్థానాలలో ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని, రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థికి వేయాలని పిలుపునిచ్చారు.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఎలాంటి ఓటు వేయొద్దని చెప్పారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను ఏపీటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని సూచించారు. సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో వర్చువల్‌గా సమావేశమైన చంద్రబాబు ఈ పిలుపిచ్చారు.
పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ 30 శాతం దొంగ ఓట్లు చేర్చిందని చెబుతూ వైసీపీకి ఎవ్వరూ ఎలాంటి ఓటు వేయొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. దొంగ ఓట్లు వేసేవారిపై కేసులు పెట్టడంతో పాటు.. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిని వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు.
టీచర్ల సమస్యలపై మండలిలో పోరాడేవారికే ఓటేయాలని చెబుతూ వామపక్ష అభ్యర్థులకు చంద్రబాబు మద్దతు పలికారు. ఒక్కో టీచర్‌కు రూ.5 వేలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని, అవినీతి డబ్బుతో టీచర్ల ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనన ఆయన ఉపాధ్యాయులను హెచ్చరించారు. జగన్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ పతనమైపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
పైగా, 2024 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నాంది అని చంద్రబాబునాయుడు అభివర్ణించడం గమనార్హం. బిజెపితో పొత్తును తెంచుకున్న తర్వాత తన పార్టీతో పాటు ఇతర పార్టీ అభ్యర్థికి కూడా ఓటు వేయాలని చంద్రబాబు అభ్యర్థించడం ఇదే మొదటిసారి.