చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా క్సీ జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. 69 ఏళ్ల ఈ చైనా కమ్యూనిస్టు పార్టీ నేత మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను పలు దేశాల నేతలు అభినందించారు.
బీజింగ్‌లోని గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్స్‌లో జరుగుతున్న పద్నాల్గవ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (జాతీయ పార్లమెంటు) సమావేశం శుక్రవారం ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. చైనా కొత్త ఉపాధ్యక్షుడిగా సిపిసి మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు 68 ఏళ్ల హాన్ జెంగ్‌ను ఎన్పిసి ఎన్నుకుంది. ఇంతకుముందు ఈ బాధ్యతలను వాంగ్‌కి షాన్ నిర్వహించారు.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మిలిటరీ కమిషన్ చైర్మన్ ఎన్నికతోబాటు పీపుల్స్ కాంగ్రెస్ కొత్త చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, వివిధ స్టాండింగ్ కమిటీల ఎన్నిక కూడా జరిగింది. గత అక్టోబరులో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సిపిసి) మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్ తిరిగి ఎన్నికైన సంగతి తెలిసిందే. మావో తర్వాత చైనాలో అత్యంత బలమైన నేతగా ఎదిగారు.
కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జిన్‌పింగ్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో ప్రతిజ్ఞ చేస్తూ, రాజ్యాంగానికి బద్ధుడనై ఉంటానని చెప్పారు. జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా అనేక గడ్డు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. కరోనా మహమ్మారి దేశ ప్రజలను కకావికలం కావించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో సహా పలు సంపన్న దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని సతమతమవుతుండడంతో దాని ప్రభావం చైనా మీద కూడా పడింది.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ రంగం పునాదిగా అధునాతన సోషలిస్టు చైనా నిర్మాణమే తన లక్ష్యమని అక్టోబరులో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ ఉద్ఘాటించింది. రెండవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఈ దశాబ్దాంతానికి నెంబర్ వన్ గా ఎదగనుందని ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు అంచనా వేశాయి. ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని యథేచ్ఛగా కొనసాగించడం కోసం, సోషలిస్టు చైనాను ఎదగనీయకుండా చేయాలని అగ్రరాజ్యం వేస్తున్న ఎత్తులకు చెక్ పెడుతూ బహుళ ధ్రువ ప్రపంచం కోసం రష్యా తదితర దేశాలతో కలసి కృషి చేస్తున్నది