ప్రముఖ సాహితీవేత్త మధురాంతకం నరేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, ఉపాధ్యక్షురాలు కుముద్ శర్మ ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
పురస్కారంలో భాగంగా ఆయన కు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, దుశ్శాలువతో సత్కరించారు. మధురాంతకం నరేంద్ర రచించిన మనోధర్మ పరాగం నవలకు 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ హిందీ కవి మాధవ్ కౌశిక్ ఎన్నికయ్యారు. ఇక, కేంద్ర సాహిత్య అకాడమీలోని తెలుగు సలహా బోర్డు కన్వీనర్‌గా సి. మృణాళిని ఎన్నికయ్యారు. అట్టహాసంగా ప్రారంభమైన కేంద్ర సాహిత్య అకాడమీ 2023 సాహిత్యోత్సవంలో శనివారం, తొలిరోజే తెలుగు రచయితలు, కవులు చాలామంది పాల్గొన్నారు.
బహుభాషా కవుల సమ్మేళనంలో ‘ఆంధ్రజ్యోతి’ అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావు(కృష్ణుడు) కవితను చదివారు. యువసాహితీ కార్యక్రమంలో ప్రముఖ కవి అనిల్ డానీ, దక్షిణాది రచయితల సమావేశంలో ప్రముఖ కవి వి.రామమోహన్ రావు, బహుభాషా కథా పఠనంలో ప్రముఖ రచయిత వేంపల్లి గంగాధర్, అస్మిత కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి ఉషా ఆకెళ్ల తమ రచనలు చదివారు.