ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో.. కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ ఆ తర్వాత రాజకీయాలలో క్రియాశీలకంగా లేరు. కానీ.. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు వచ్చారు. అక్కడ కొన్ని రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించినా, ఆ తర్వాత మళ్లీ మౌనం వహించారు.
ఆయన బీజేపీలో చేరతారని, జాతీయ స్థాయిలో పదవీ కూడా ఇవ్వగలమని హామీ పొందారని వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. పీలేరు నుంచి 2019లో పోటీచేసి ఓటమి చెందారు. 2024లో ఆయనే పోటీచేస్తున్నట్లు ఇటీవల పాదయాత్ర సందర్భంగా ఎటు వెళ్లిన నారా లోకేష్ ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు.. ఆయన సమైక్యవాదం వినిపించి సంచలనంగా మారారు.ఈ అంశంపైననే ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ 2014లో ఏపిలో ఒక్క సీటు కూడా గెలుపొందలేక పోవడంతో ఆ తర్వాత రాజకీయంగా మౌనంగా ఉంటూ వచ్చారు.
