సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె.విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
1959లో ట్రైనీ ఐపీఎస్ గా విధుల్లో చేరిన విజయరామారావు హైదరాబాద్ కమిషనర్ గా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గా హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు దర్యాప్తు చేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.
నాటి సీఎల్పీ నేత పి జనార్ధనరెడ్డిని ఓడించడంతో ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేత అయి, తదుపరి ముఖ్యమంత్రి కాగలిగారు. కాగా, ఆయనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసం అదే సామాజికవర్గంకు చెందిన కేసీఆర్ కు మంత్రిపదవి ఇవ్వలేకపోయారు. డిప్యూటీ స్పీకర్ గా చేశారు. ఆ ఆగ్రహంతోనే ఆయన తదుపరి టిఆర్ఎస్ స్థాపించి, తెలంగాణ ఉద్యమం చేపట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కారకులయ్యారు.
ప్రస్తుత ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆయన జన్మించారు. విద్యాభ్యాసమంతా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సాగింది. మద్రాసు యూనివర్సిటీలో బీఏ చదివారు. 1958లో ఎస్ఆర్ఆర్ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత సివిల్స్‌కి ఎంపికయ్యారు. ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి ఏపీలోని వివిధ జిల్లాల్లో పని చేశారు.
ఆయన మృతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని కెసిఆర్ పేర్కొన్నారు. విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. .విజయరామారావు మృతి పట్ల నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీబీఐ డైరెక్టర్‌గా.. మంత్రిగా విజయ రామారావు విశేష సేవలు అందించారని కొనియాడారు.