కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు సమానంగా పంపిణీ చేసినట్లైతే అనేక మరణాలను నివారించగలిగే వారమని పీపుల్స్ వాక్సిన్ అలయెన్స్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్లు అందరికీ అందినట్లైతే కరోనా వచ్చిన మొదటి ఏడాదిలోనే కనీసం 13 లక్షల మంది జీవితాలను కాపాడేందుకు అవకాశం వుండేదని, అంటే ప్రతి 24 సెకన్లకు ఒకరి మృతిని నివారించగలిగి వుండేవారమని అది తెలిపింది.
కరోనాని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రకటించి మూడేళ్లు అయిన సందర్భంగా వందకుపైగా సంస్థలు, నెట్వర్క్ల సంకీర్ణమైన పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ ఈ మేరకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
లాభాలను, జాతీయవాదాన్ని పక్కకు పెట్టి అంతర్జాతీయంగా వెల్లువెత్తిన స్పందనను కూడా మనం ఈ సందర్భంగా చూశాం. అవసరాన్ని బట్టి పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లను తయారుచేయడానికి బదులుగా, ఔషధ కంపెనీలు వ్యాక్సిన్ డోసులను సంపన్న దేశాలకు ముందుగా విక్రయించడం ద్వారా గరిష్టంగా లాభాలు పొందాయి. కరోనా మహమ్మారి తలెత్తి నాల్గో సంవత్సరంలోకి అడుగిడుతున్నా అనేక వర్ధమాన దేశాలు ఇప్పటికీ అందరికీ అందుబాటులో వుండే చికిత్సలు లేదా పరీక్షలు తీసుకురాలేకపోయాయి.
అలాగే నిరుపేదలైన మహిళలు, నల్ల జాతీయులు, తక్కువ, ఒక మోస్తరు ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలు కోవిడ్ తాలూకు ప్రధాన భారాన్ని మోస్తున్నారని ఆ లేఖ పేర్కొంది. ఈ అసమానతలన్నీ నివారించదగినవే అయినందున, వాటిని నివారించి వున్నట్లైతే ఈ మహమ్మారి వల్ల సంభవించిన ఇంతటి విషాద స్థాయిని తగ్గించడానికి వీలుండేదని లేఖ పేర్కొంది.
డబ్ల్యుహెచ్ఓలో కరోనా మహమ్మారిపై ఒప్పందానికి మద్దతునివ్వడం, పేద దేశాల్లో వినూత్నమైన శాస్త్రీయ ఆవిష్కరణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, తయారీ సామర్ధ్యాన్ని పెంచడం, మేథో సంపత్తి అడ్డంకులను తొలగించడం, భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులు తలెత్తినపుడు మళ్లీ ఇటువంటి మరణాలు, కష్టాలు పునరావృతం కాకుండా సమానంగా అందరికీ చికిత్స అందే ప్రణాళికలు అమలు చేయడంతో సహా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాల్సిందిగా ఆ లేఖ ప్రపంచ నేతలను కోరింది.