అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంఫై మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నసమయంలో రెండో రోజు బుధవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు.
శ్రీధర్ రెడ్డి నిరసనను, ప్రభుత్వం, తాను కూడా గుర్తించామని స్పీకర్ తెలిపారు. కానీ, ఇలా చేయడం తగదు, కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుందని స్పీకర్ తమ్మినేని చెప్పినా కోటంరెడ్డి అలానే నిల్చుండి పోయారు.
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి స్పందిస్తూ సమస్యలు లేని సోసైటీ ఉండదని.. సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలని కోరారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని తెలిపారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీధర్ రెడ్డి ఇక్కడకు వచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని… శ్రీధర్ రెడ్డిని క్షమించొద్దు అని, అవకాశం ఇవ్వద్దు అవసరం అయితే చర్యలు తీసుకోండి’’ అంటూ స్పీకర్‌కు మంత్రి అంబటి వినతి చేశారు.
అంతకుముందు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా నని పేర్కొన్నారు.
అలాగే సాగునీటి రంగంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు , మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. సాగునీటిపై అన్ని ప్రభుత్వాలు దృష్టిపెడతాయని.. అయితే ఈ నాలుగేళ్ళు ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యిందని అచ్చెన్నా విమర్శించారు.
చంద్రబాబు సీఎంగా సాగునీటికి రూ.68293 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. 68 ప్రాజెక్టులు డిజైన్ చేశారని, 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు 7 లక్షల ఎకరాలకు స్ధిరీకరణ చేశారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఇఎన్సి నారాయణ రెడ్డి 2014-18 మధ్య 69 వేల ఎకరాలు సాగునీరు అందించారని చెప్పారు. అయితే, ఈ నాలుగేళ్ళలో రూ.488 కోట్లు ఖర్చు చేసి 11 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించారని చెప్పారు.